28, జూన్ 2008, శనివారం

దేశం తలపట్టుకుంది

13 వ్యాఖ్యలు
నారదుడు లోకసంచారం చేస్తూ, భారతం మీదుగా పోతుంటే ఢిల్లీ కనిపించింది. 'చాన్నాళ్ళైంది ఢిల్లీ చూసి, ఓసారెళ్ళొద్దాం' అనుకుని కిందికి దిగి జనపథాల వెంటా, రాజపథాల వెంటా నడుస్తూ పోతూంటే అనేక మంది నాయకులు కనిపించారు. అందరూ కూడా తలపట్టుకుని కూచ్చుని ఉన్నారు. ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆగాడు.

26, జూన్ 2008, గురువారం

కండకావరం

12 వ్యాఖ్యలు
నిరసన ప్రదర్శనల్లో దిష్టిబొమ్మలకు చెప్పులదండ వెయ్యనిదెవ్వరు? చెప్పుదెబ్బలు కొట్టనిదెవ్వరు? తగలబెట్టనిదెవ్వరు? నోటికొచ్చినట్టు బూతులు తిట్టనిదెవ్వరు?

శవయాత్ర నిర్వహించి, శాస్త్రోక్తంగా దహనకాండ జరిపించడం కూడా చూసామే!

మనకిది చాలా సహజమైపోయింది. సమాజంలో సర్వ సాధారణమైపోయిన వికృత చర్యలివి. ఆంధ్రజ్యోతి పాత్రికేయులు తమపై జరిగిన దాడికి నిరసనగా దాడి జరిపించిన నేత దిష్టిబొమ్మను తగలపెట్టారు. దళితులపై జరిగే అత్యాచారాలను నిరోధించే చట్టాన్ని ఉపయోగించాల్సినంతటి నేరమట అది. అసలా దాడి చేయించిన వారిపై, దాడులు మళ్ళీ చేస్తాం అని బహిరంగంగా చెప్పిన, చెబుతున్న హింసోన్మాదులపై చర్యలేవీ?

సంఘటనలో పాత్రధారులైన ఈ ఇద్దరిలో ఒకరేమో ఆ రెండు పత్రికల్లో ఒకటి -అంచేత తప్పు వాళ్ళదే -మరో ఆలోచన లేదు. కాబట్టి చర్యలు వాళ్ళ మీదే! దళితులపై అత్యాచారాల నిరోధానికి ఉద్దేశించిన చట్టాన్ని, వేరొకరిపై అత్యాచారం చేసేందుకు ఉపయోగించింది ప్రభుత్వం. తననెదిరించినవాడిని వేటాడేందుకు ఎంతకైనా తెగించగలనని మరోసారి నిరూపించాడు ముఠాకోరు.

"తప్పుల మీద తప్పులు చేసేందుకు ఈ ప్రభుత్వం ఓవర్‌టైము పని చేస్తోంద"ని ఎల్‌కే అద్వానీ కేంద్రప్రభుత్వం గురించి అన్నాడు అప్పుడెప్పుడో. ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయనే ఆత్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రింబవళ్ళు పనిచేసి మరీ తాను చెయ్యదలచిన తప్పుడు పనులను చేసేస్తోంది. ఎన్నికల తరవాత ఇలాంటి అవకాశం రాదని కాబోలు!

23, జూన్ 2008, సోమవారం

తెలంగాణా ఉద్యమం చేతులు మారుతోంది

17 వ్యాఖ్యలు
దేవేందర్ గౌడ్ రాజీనామా చేసాడు. తెలుగుదేశానికి దెబ్బ తగిలినట్టే! (దీన్ని పార్టీ చీలిక అనొచ్చా అనేది ఇంకో నాలుగైదు రోజుల్లో తెలియవచ్చు) అయితే, అంతకంటే పెద్ద దెబ్బ తెరాసకు తగలొచ్చు.

ఇక గౌడ్ ఏంచేస్తాడు? ఏదైనా పార్టీలో చేరొచ్చు. లేదా తానే ఒక పార్టీని పెట్టొచ్చు.

ఏ విధంగా చూసినా గౌడ్ తెరాసతో చేరే ప్రసక్తి లేదు. కేసీయారు నియంతృత్వం సంగతి తెలిసీ గౌడ్ ఆయనతో చేతులు కలపడు. ఇప్పటికే కేసీయారు కాస్త నీరసపడ్డాడు. తెరాస ప్రభ తగ్గింది. ప్రజల్లో కేసీయారు పట్ల వ్యతిరేకత మొన్న బయటపడింది. వేరే ఏదైనా పార్టీలో చేరతాడేమోగానీ.. తెరాసలో మాత్రం చేరడు. అందులో చేరి కోపైలట్‌గా ఉండాల్సిన అవసరం ఆయనకు లేదు. రాజకీయంగా, వ్యక్తిగత ప్రతిష్ట పరంగా కేసీయారు కంటే గౌడ్ బలవంతుడు. పైగా కులవంతుడు కూడాను -బీసీ నాయకుడిగా ఆయన మంచి స్థానంలో ఉన్నాడు. తెరాసపై ప్రజలకున్న అసంతృప్తి గౌడ్‌కు బాగా లాభిస్తుంది. కాంగ్రెసు, బీజేపీలతో చేరడు.పుట్టబోయే పార్టీలో చేరే అవకాశమూ తక్కువేననిపిస్తోంది. కాంగ్రెసు, తెరాస అసమ్మతివాదులకు గౌడ్ పార్టీ ఆశ్రయమివ్వవచ్చు. ఆ విధంగా కాంగ్రెసుకూ దెబ్బే!

ఇవన్నీ కాకపోతే తానే స్వంతంగా పార్టీ పెట్టొచ్చు -(తెలంగాణా దేశం?). ఏదేమైనా ఇక తెలంగాణా అంశాన్ని గౌడ్ ప్రభావితం చేస్తాడు. తెరాసది ఇక రెండో స్థానమే! తెలంగాణాకు అనుకూలంగా ఏర్పడిన మంచి పరిణామం ఇది.

17, జూన్ 2008, మంగళవారం

లోకలు వార్మింగు

22 వ్యాఖ్యలు
కొత్తపాళీ గారు అదిలించడంతో గ్లోబలు వార్మింగు పట్ల నేనూ కాస్త హడావుడి పడదామని త్వరపడ్డాను. నిజం చెప్పొద్దూ.. ఈ దీపాలార్పడంలో (ప్రతిపదార్థంలోనే తీసుకోండి సుమా!) నాకంత నమ్మకం లేదండీ. కానీ ప్రజల్లో అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని తెలిసాక, ఇలా అవగాహన కలిగించడం కోసం నేనూ ఏదైనా చెయ్యాలని తలపోసాను. పోసాక, ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాను. కున్నాక, పని మొదలెట్టాను. ఇక్కడో ముక్క చెప్పాలి:

గ్లోబలు వార్మింగు గురించి చెప్పడమే నా పని, చేసేదేమీ లేదు అని నేను అనుకున్నాను. అసలు నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిందే ఇది.

ముందుగా ఆఫీసులో జనాన్ని ఒకచోట కూలేసి, క్లాసు తీసుకున్నాను.

"చూడండీ, మీ పిల్లలకు ఆహార భద్రత, పర్యావరణ భద్రత, ఆరోగ్య భద్రత, వగైరాలను ఎలా ఇస్తారూ?" అని అడిగాను. వాళ్ళ తెల్లమొహాలను తనివితీరా చూసుకున్నాక, గ్లోబలు వార్మింగు గురించి చెప్పి "మీరూ లైట్లు ఆర్పండి, ఈ సంగతిని మీరు మరో పదిమందికి చెప్పండి. నేను కూడా మా అపార్టుమెంటులో పన్నెండు మందికి చెబుతున్నాను." అని అన్నాను.


~~~~~~~~~~~~~

ఇంటికి పోయాక, మావిణ్ణి, పిల్లల్ని సమావేశపరచి గ్లోబలు వార్మింగు గురించి ఉపన్యాసమిచ్చి, దీనిపై మనమంతా తక్షణమే స్పందించకపోతే మనకు పుట్టగతులుండవని హెచ్చరించాను. అంతటితో ఆగకుండా మా రక్షకుణ్ణి పిలిచి, ఓ కాగితం రాసిచ్చి మా అపార్టుమెంటు జనాలకు పంపించాను. అయినా నాకు తృప్తి కలగలేదు. భూతాపోద్దీపనపై పద్యాలు రాద్దామని సంకల్పించాను. కళ్ళు మూసుకుని పద్యాలు కుట్టడం మొదలెట్టాను. అప్పటికే నా హడావుడితోటి మావిడకి చిరాకెత్తి నట్టుంది. ఈ పద్యగానంతోటి వళ్ళు మండింది.. "పద్యాలు రాసుకుంటే రాసుకోగానీ, పాడకు. నాకు చిరాకు" అంది. పద్య సౌందర్యాన్ని చూసేందుకు ఈవిడ కళ్ళెప్పుడు తెరుచుకుంటాయో అని అనుకుంటూ కళ్ళు తెరిచాను. ఎప్పుడు జారుకున్నారోగానీ, పిల్లలిద్దరూ లేరు.

సృజనాత్మకమైన పనిని ఇలా చిన్నబుచ్చిందే అని మనసులో బాధపడి "అసలు గ్లోబల్ వార్మింగు ఎంత ప్రమాదకరమో నీకింకా అర్థమైనట్టు లేదు" అని అన్నాను, కాస్త నిష్ఠూరం ధ్వనిస్తూ. వెంటనే "వార్మింగు గురించి నాకు తెలుసులెమ్మం"టూ తాను రాసిన బ్లాగు చూపించింది. గుండె కలుక్కుమంది. ముందుగా నాకొక్ఖ ముక్క చెబితే ఏంబోయింది అని మనసు మూలిగింది.

"మరి, నువ్వు బ్లాగు రాసుకున్నావుగానీ, నేను పద్యాలు రాసి బ్లాగులో పెడదామంటే అడ్డుకుంటావే?" అని ఆక్రోశించాను.

"గ్లోబలు వార్మింగు గురించి కాదుగానీ లోకలు వార్మింగు గురించి ఆలోచించు చాలు" అంది.

'లోకలు వార్మింగా?' విస్తుపోయాను. నేను తేరుకునేలోపే "అందరూ గ్లోబలు వార్మింగును పట్టించుకునేవారే! కనీసం నీలాంటి చైతన్యశీలురన్నా లోకలు వార్మింగును పట్టించుకోకపోతే ఎలా" అని అంది.

అందులో ఎగతాళి ఏమైనా ఉందేమోనని సందేహించబోయానుగానీ, అయాచితంగా దొరికిన చైతన్యశీలి అనే గొప్ప మెప్పును అంత తేలిగ్గా కొట్టి పారేసేందుకు నాకు మనసు రాలేదు. కానీ ఈ లోకలు వార్మింగు ఏంటసలు? ఆమధ్య పొద్దులో భూతాపం గురించి త్రివిక్రమ్ గారు రాసినప్పుడూ, ప్రశాంతి, కొత్తపాళీ గారలు బత్తీబందు పెట్టి గ్లోబలు వార్మింగు గురించి చెప్పినప్పుడూ గ్లోబలు అని అన్నారు గానీ లోకలనలేదు. జాలంలో కూడా గ్లోబలు గురించి చాలానే సరుకు కనిపించింది గానీ ఎక్కడా లోకలు వార్మింగు గురించి కనబడిన గుర్తు లేదు. ఏంటబ్బా అది?

"అదేంటో నాకు తెలీదు, నువ్వేచెప్పు" అని అడుగుదామంటే.. "ఆ మాత్రం తెలీదా" అని నా దగ్గర ఆశ్చర్యపోవడం మాత్రమే కాకుండా, బ్లాగులో కూడా ఆశ్చర్యపోతుందేమోనని భయమేసింది. అంచేత "ఔనౌను, లోకలు వార్మింగు గురించి కూడా మనం జాగ్రత్త వహించాలి, నేనాపనిలో ఉంటానిక" అని చెప్పి అర్జెంటుగా బైటకు పోబోయాను, అక్కడే ఉంటే దాని గురించి తరచి అడుగుద్దేమోనని.

"అదేంటి వెళ్తున్నావ్, టీవీ ఎవరు కట్టేస్తారు, ఆ గదిలో లైట్లెవరార్పుతారు, ఫ్యానెవరు ఆపుతారు?" అని అడిగింది. నాకు జీవితంలో అస్సలు నచ్చని పని - ఈ కట్టెయ్యడాలు, ఆర్పడాలు, ఆపడాలు. చిన్నప్పుడు మానాన్న నా ప్రాణం తీసేవాడు - లైటు తియ్యి, లైటు తియ్యి అని. పెళ్ళయ్యాక మావిడ పుచ్చుకుంది ఆ బాధ్యత. నాకు చిరాకని తెలిసి కూడా అలా చెప్పడం మానదు. పైగా తీసేదాకా ప్రాణం తీస్తుంది. తప్పదు కాబట్టి, విరక్తిగానైనా టీవీ కట్టేసి, లైట్లార్పి, ఫ్యానాపి బయల్దేరాను. మావిడ తెలివైంది, ముందో రూలెట్టింది.. ఎవరేస్తే వాళ్ళే ఆర్పాలి అని. తానేమో ఫ్యాన్లూ, లైట్లూ వెయ్యదు, టీవీ పెట్టదు. నాకోసం కాచుక్కూచుంటుంది, నేనెలాగూ ఇంట్లోకి రాగానే ఓపెన్ సెసేమ్ అన్నట్టు అన్ని స్విచ్చిల్నీ టకటకా నొక్కేస్తాను గదా, అందుకోసం!

బయటికి పోయేందుకు చెప్పులేసుకుంటూండగా వెనకనుండి అంటోంది.. "లోకలు వార్మింగును తగ్గించడమంటే ఇదే! ఏడాదికోసారి గోవాడ తిరణాల జరిగినట్టు లైట్లార్పే పండగ చెయ్యగానే సరికాదు మేష్టారూ, రోజూ జాగ్రత్తగా ఉండాలి."


~~~~~~~~~~~~~

పని చెయ్యమని నోరు పెట్టుకోని ఉపన్యాసం ఇవ్వొచ్చు, ఓ పేజీ నిండా నోటీసు రాసి పంపొచ్చు.. కానీ మనమే ఆ పని చెయ్యాలంటే ఎలా?

చెప్పడమే నాకిష్టం, చెయ్యడం కాదు. సమాజం మాత్రం 'చెప్పడమే కాదు చెయ్యాలి కూడా' అంటోంది. 'ఎవడికి ఇష్టమైన పని వాడు చెయ్యాలి. సమాజమా గాడిదగుడ్డా.., దాన్నేం పట్టించుకోనక్కరలేదు' అని అనుకుందామనుకున్నా... నా విషయంలో మాత్రం 'ఆర్పమని చెవటమే కాదు, ఆర్పాలి కూడా' అనే సమాజపు ఎంగిలి విలువే చెల్లుబాటవుతోంది. ప్చ్! ఇకపై లోకలు వార్మింగును అరికట్టాలని నిర్ణయించుకున్నాను; తప్పేట్టు లేదు!

13, జూన్ 2008, శుక్రవారం

దశావతారం

12 వ్యాఖ్యలు
ఆ పేరేంటి? దశమావతారమన్నా అనాలి లేదా దశావతారాలు అనన్నా అనాలి. దశావతారం అనొచ్చా? "పది అవతారం" !!!

8, జూన్ 2008, ఆదివారం

మేటి దివిటీలు - 2

8 వ్యాఖ్యలు
బాపు
బామ్మ (బాపు బొమ్మ) గురించి తెలీని తెలుగువారుండరు. మన మేటి చిత్రకారుడు బాపు. మన మేటి సినిమా దర్శకుడు బాపు. మేటి కార్టూనిస్టు బాపు. మేటి రామభక్తుడు బాపు. మేటి దివిటీల్లో బాపు ఒకడు.

స్నేహానికి మేటి ప్రతీకల్లో బాపు ఒకడు. బాపు, రమణల స్నేహం జగద్విదితం. వీరిద్దరి స్నేహాన్ని పురస్కరించుకుని వీరిని ద్వంద్వ సమాసమని ప్రేమగా పిలుచుకుంటాం. ఆ
ద్వంద్వ సమాసాన్ని ఇక్కడ విడదీసిన పాపం నాదే! బాపు తన సినిమాలకు గాను అనేక మంది సాంకేతికులతో కలిసి పనిచేసాడట. ఒక్క మాటలు కుట్టే పనికి మాత్రం రమణను తప్పించుకోలేకపోయాడు. "ఆ సంకెళ్ళకూ జై" అంటూ స్వయంగా ముళ్ళపూడి వెంకట రమణ చెప్పిన మాటే అది. రచనలోని గొప్పదనాన్ని తన బొమ్మలతో బాపు మింగేస్తాడని రావిశాస్త్రి వాపోయాడట.

బాపు బొమ్మల గురించి చెప్పిన మాటల్లో చిరస్మరణీయమైనది మరొకటుంది..
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో పద్యాభిషేకం చేసాడు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఆ చేతిరాత ఒక ఫాంటై అలరిస్తోంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆ మేటి దివిటీకి నా హారతి..
బాపు గీసిన బొమ్మ
చూసినంతనె బ్రహ్మ
కండ్ల మెరిసెను చెమ్మ
తెలుగు బిడ్డా!
ఎనిమిది కళ్ళు చెమ్మగిల్లిన కారణం..
మహిమలున్నను చెంత
మలచలేనని సుంత
ఈర్ష్య తోడను కొంత
ఓ తెలుగు బిడ్డా!
ఈర్ష్యతోనట! కానీ ఆ కారణం కొంతే.. మరి మిగతా కారణమేంటో...
అం..త బాపును కూడ
తానె చేసినవాడ
ననెడి గర్వము తోడ
తెలుగు బిడ్డా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఆ మహానుభావుడికి, ఆ సత్తిరాజు లక్ష్మీనారాయణకు, ఆ బాపుకు పద్మ పురస్కారాన్ని ప్రదానం చేసే అవకాశాన్ని, తద్వారా తమ్ము తాము గౌరవించుకునే అవకాశాన్నీ పొందలేని అజ్ఞానులపై నాకు సానుభూతి కలుగుతోంది.

ప్రజల గుండెల్లో పటం కట్టుకుని ఉన్నవాడికి ఏ పురస్కారాలూ అవసరం లేదులే!

సంబంధిత టపాలు