23, సెప్టెంబర్ 2007, ఆదివారం

ట్రాఫిక్కబుర్లు

20 కామెంట్‌లు
హైదరాబాదు.
మంగళవారం సాయంత్రం ఆరుంబావు.
ఆఫీసు నుండి ఇంటికెళ్తున్నా, కారులో.
నేనే నడుపుతున్నాను.

నామీద జాలిపడ్డానికి ఇంతకు మించిన కారణం మరోటక్కరలేదు.

21, సెప్టెంబర్ 2007, శుక్రవారం

'కుడీ' 'ఎడమా', మధ్యలో కాంగ్రెసు, నెత్తి మీద కరుణానిధి

5 కామెంట్‌లు
మధ్యంతరం వచ్చేటట్టే కనబడుతోంది. కాంగ్రెసుకు తల వాచేటట్టూ కనబడుతోంది. ఒకేపు వామపక్షాలతోనూ, మరో పక్క బీజేపీతోటి ఎడాపెడా వాయింపుకు గురై కుదేలైపోయింది. అయితే పాపం వీళ్ళకంటే కూడా పెద్ద ప్రమాదం తమవాడు, మిత్రుడూ అయిన కరుణానిధి నుండి వస్తున్నది. కాంగ్రెసోళ్ళు సాక్షాత్తూ రాముడి ఉనికినే ప్రశ్నించి, కన్ను లొట్టోయిన దశలో తీరిగ్గా నాలుక్కరుచుకుని, ఆకులు పట్టుకుని 'ఉఫ్ ఉఫ్' అనుకుంటూ ఉన్నారు, ప్రస్తుతం. గోరుచుట్టు మీద రోకటి పోటు లాగా, మూలిగే నక్కమీద తాటి పండు లాగా కరుణానిధి తయారయ్యాడు వీళ్ళకి. అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు. కరుణానిధి వాగుడు దేశమంతా వినబడుతోంది మరి!

ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల జంట కామెడీ ఒకటుంది. కోట, తుపాకీ ఒకటి పట్టుకుని తిరుగుతూంటాడు. ధర్మవరపు ఆయనకు ఆషాఢభూతి లాంటి అనుచరుడు లాంటి సహచరుడు. "మేజరు గారంటే ఏంటనుకున్నావ్? చవటనుకున్నావా? వెధవనుకున్నావా? చేతకాని దద్దమ్మనుకున్నావా?" అంటూ ఇలా ఉన్నవీ లేనివీ కల్పించి ఎదటివాడు ఏమీ అనకపోయినా అన్నీ తానే తిడుతూ ఎదటి వాళ్ళతో పోట్లాడుతూ ఉంటాడు. అంతా అభిమానం కొద్దీ అంటున్నట్టే ఉంటుంది గానీ ఆ మాటల్లో అంతా అవమానమే! కోటకు ఇతగాణ్ణి ఎలా వదిలించుకోవాలో తెలీదు.

ఖచ్చితంగా అలాగే కాకపోయినా సోనియా కరుణలకు, పై కామెడీకీ కొంత పోలిక ఉంది. సోనియా ఏదైతే ఒద్దనుకుంటోందో కరుణ అదే చేస్తున్నాడు. అతడిని అలా మాట్టాడొద్దని చెప్పలేదు, అలాగని ఊరుకోనూ లేదు. ప్రస్తుతం సోనియా, కరుణానిధిల వ్యవహారం చూస్తంటే నాకు కోట, ధర్మవరపే గుర్తుకొస్తున్నారు. పాపం సోనియా! కరుణానిధిని వదిలించుకోగలదో లేదో!!


మరో దృక్కోణం

ఈ వ్యవహారాన్ని మరో కోణం నుండి చూస్తే.. గుడ్డిలో మెల్ల లాగా కరుణానిధి వాచాలత వలన కాంగ్రెసుకు కొద్దో గొప్పో ఉపయోగమూ లేకపోలేదు. ఆయన నోటి దురుసు కారణంగా బీజేపీకి ఆయుధాలు దొరికి కాస్త పుంజుకొనే అవకాశం ఉంది. వామపక్షాల వాళ్ళు ప్రపంచంలో దేన్నైనా సహిస్తారేమో గానీ, బీజేపీ బలపడితే తట్టుకోలేరు. వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉన్న తరుణంలో మధ్యంతరం జరిగితే బీజేపీకి సీట్లెక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, వామపక్షాలు అందుకు తెగబడక పోవచ్చు. అందుకోసం అణు ఒప్పందంపై తమ అభ్యంతరాలను పక్కన బెడతారు. (వాళ్ళు దేన్నైనా పక్కన బెట్టగలరు!) ఈ రకంగా కరుణానిధి దుందుడుకు ధోరణి కాంగ్రెసుకు ఉపయోగపడుతుంది.

20, సెప్టెంబర్ 2007, గురువారం

గురు లఘువులు

42 కామెంట్‌లు
తెలుగు బ్లాగరుల్లో పద్యాలు రాసేవారు కొందరున్నారు. వారివలన పద్య చాపల్యం అంటుకున్న వారిలో నేనూ ఒకణ్ణి. అదే చెబుతున్నానిక్కడ.

17, సెప్టెంబర్ 2007, సోమవారం

రామ సేతువు - ఎన్డీటీవి చర్చ

9 కామెంట్‌లు
రాముడు ఉన్నాడా, లేడా అనే విషయంపై కాంగ్రెసు ప్రభుత్వం ఛప్పన్నారు తప్పులు చేసి దిద్దుకొంటూండగా జరిగిన అనేకానేక చర్చల్లో ఎన్డీటీవీ వారి ఆదివారం నాటి చర్చ ఒకటి నేను చూసాను. బర్ఖా దత్ వియ్ ది పీపుల్ అనే ఈ చర్చా కార్యక్రమాన్ని చక్కగా మంచి సమయస్ఫూర్తితో చేస్తుంది. నిన్నటి రాత్రి జరిగిన చర్చలో కొన్ని విశేషాలు...

నేను టీవీ పెట్టేటప్పటికీ ఆ ప్రొఫెసరుగారు చెబుతున్నాడు.. "రాముడికీ, బ్రిడ్జికీ సంబంధం లేదు. రాజకీయాలకూ మతానికీ సంబంధం లేదు. అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవడం ప్రభుత్వపు తప్పు."

ఈలోగా ఆర్య ద్రావిడ తగువు చర్చకి వచ్చింది. 'రావణుడు బ్త్రాహ్మణుడు, రాముడు, వాల్మీకి బ్రాహ్మణులు కాదు అనే విషయం కరుణానిధికి తెలీదు. ఆయనకు చరిత్ర తెలీదు, కానీ మాట్లాడతాడు' అని సుబ్రహ్మణ్యం స్వామి అన్నాడు. దీనిపై ఆయనా, రాజా కాసేపు పోట్టాడుకున్నారు. ఇహ చూడక్కరలేదనుకుంటా అని అనుకుంటూ ఉన్నాను.. ఈలోగా బర్ఖా దత్ వాళ్ళకు అడ్డం పడిపోయి పోట్లాటను ఆపేసింది.

రాజకీయులు వాళ్ళ మార్కు రిమార్కులు, వాదనలూ చేసారు. వాళ్ళ వాదన చూసి ఆశాభంగం చెందేటంత ఆశలు నాకేమీ లేవు వాళ్ళమీద. కానీ ప్రొఫెసరు మాట్లాడిన విధానం చూసి మాత్రం కష్టమేసింది..

ఆయన "రామ సేతువు" కారణంగా ప్రాజెక్టు ఆగిపోవడానికి బద్ధ వ్యతిరేకి. అసలు రామసేతువును రామ సేతువు అని అనడానికి కూడా ఆయన ఇచ్చగించలేదు. పని గట్టుకుని యాడమ్స్ బ్రిడ్జి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, కష్టమూ వేసింది. రాముడు కట్టాడో లేదో పక్కన బెట్టండి. ఈ జాతి సహస్రాబ్దుల కిందటి నుండీ నమ్ముతూ వచ్చిన విషయం కదా అది; దాన్ని పక్కన బెట్టి ఈ కొత్త పేరు - "యాడమ్స్ బ్రిడ్జి" అని అనడమేంటి? అది ఎక్కడినుండి వచ్చిందో వెతకబోతే ఇదట దాని కథ. ఏఁవన్నా అర్థముందండీ? చారిత్రకుడు దేన్ని నమ్ముతున్నాడో చూసారా? నాకది చిన్న విషయంగా అనిపించలేదు. మనోడు చెబితే మౌఢ్యం, పైవోడి పైత్యం పరమౌషధమా వీళ్ళకి !? ఏంటో మన వాళ్ళు..

----------------------------

అక్కడితో ఈ జాబు ఉద్దేశ్యం నెరవేరింది. ఇక రామాయణంలో పిడకలవేట..

పై కార్యక్రమ నిర్వాహకురాలికి కొన్ని అభిప్రాయాలున్నాయి (ఉండొచ్చు, తప్పులేదు). ఆమె వాటినే చర్చాఫలితంగా చూపించదలచినట్టు అనిపించింది. దాని కోసం అవిరళ కృషి జరిపినట్టు కూడా అనిపించింది. ఈవిడ గారికి ఓ అలవాటుంది. ప్రశ్న అడుగుతుంది, చెప్పేవాడికి పూర్తిగా చెప్పే చాన్సివ్వదు. వాళ్ళు చెప్పేది తనకనుకూలంగా ఉంటే సరే, లేదో.. మాటమాటకీ అడ్డం పడిపోతుంటుంది.

ఇదివరలో ఆమె సహోద్యోగి -రాజ్‌దీప్ సర్దేశాయ్, ఇప్పడు CNN IBN కి కర్త, కర్మ, క్రియ- కూడ ఇలాంటి వాడే. (వీళ్ళిద్దరికీ కామనుగా రెండు ఊతపదాలున్నాయి. అవి: "ఓకే, యు మేడ్ యువర్ పాయింట్", "ఓకే, ఫెయిరినఫ్". ఈ మాటలను వాళ్ళు వాడేటపుడు గమనించండి.. ఆ రెండింటికీ అర్థం ఒకటే స్ఫురిస్తుంది.. "ఇప్పటికే ఎక్కువగా వాగావు, ఇక మూసుకో" అని. అంత ఫోర్సుగా వాడతారు ఆ మాటలను!) . ఇకపోతే కరణ్ థాపర్.. ప్రశ్న అడుగుతాడు, కానీ జవాబు చెప్పే అవకాశమే ఇవ్వడు - పోలీసు, ఖైదీ సంభాషణ లాగా ఉంటుంది ఇంటర్వ్యూ.

వీళ్ళందరితో పోలిస్తే, మన టీవీ 9 రవిప్రకాష్ చాలా మెరుగు. ఇదివరలో జెమినీలో ఉండగా వారం వారం ఒకరిని ఇంటర్వ్యూ చేసేవాడు. వాళ్ళని చక్కగా మాట్టాడనిచ్చేవాడు. అడ్డం పడిపోయేవాడు కాదు.

--ఇవ్వాళ్టికింతే!

16, సెప్టెంబర్ 2007, ఆదివారం

ఇంటర్నెట్లో తెలుగు లోతెంత?

10 కామెంట్‌లు
ఓ మూడేళ్ళ కిందటి దాకా నెట్లో తెలుగు అనేది ఉందనే నాకు తెలియదు. ఏ పని చేసినా ఇంగ్లీషులోనే చెయ్యడం. కంప్యూటరుకు తెలుగు నేర్పొచ్చని, తెలుగులో సుబ్బరంగా రాయొచ్చని ఎప్పుడైతే తెలిసిందో.. ఇక నేను ఆ వచ్చీరాని ఇంగ్లీషు రాయడం మానేసాను. తెలుగులోనే అన్నీ!

ఇవ్వాళ తెలుగులోనే ఉండే సైట్లు బోలెడన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నా జీవితంలో భాగమైపోయాయి. భుక్తి కోసం నేను చేసే పనులు ఇవ్వని ఆత్మ తృప్తి ఆయా సైట్లలో నేను చేసే పనులు నాకిచ్చాయి.

నాకు అన్నిటి కంటే ముందు పరిచయమైన తెలుగు సైటు వికీపీడియా! తెలుగు విజ్ఞానసర్వస్వం - ఎన్‌సైక్లోపీడియా. తెలుగులో ఉన్న ఆ సైటు చూసి నాకు మూర్ఛపోయినంత పనైంది. ఎంతో స్వేచ్ఛ ఉంది అక్కడ! అక్కడ ఎవరైనా రాయొచ్చు కూడా. వెంటనే రాయడం మొదలుపెట్టాను. అప్పటికే ఉన్న సభ్యులు - ముఖ్యంగా రవి వైజాసత్య, నాకు ఎంతో సాయపడ్డారు. ఆయన నాకు వికీ గురువు! ఇప్పుడంటే వికీలో చేరేవారికి సాయం చేసేందుకు అక్కడ ఎంతో మంది ఉన్నారు గానీ, ఆ రోజుల్లో రవి ఒక్కడే వికీకంతటికీ! అసలు ఇప్పటి వికీ స్వరూపం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతింతై, వటుడింతయై అన్నట్టు పెరిగిపోతోంది. రవితో పాటు, ప్రదీప్, కాజ సుధాకరబాబు, నవీన్ వంటి ఎందరో సభ్యులు వికీని పరుగులు పెట్టిస్తున్నారు. అక్కడ నేనూ రాస్తాను. నెట్లో నేను చేసే పనులన్నిటిలోకీ నాకు బాగా ఇష్టమైనది ఇదే, నా బ్లాగు కంటే కూడా! ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సిన, రాసి తీరాల్సిన సైటు ఇది.


బ్లాగులు చూడండి.. చక్కటి తెలుగులో ఉండడమే కాదు వాటి గొప్పదనం.., చక్కటి భావాలతో, మంచి భాషతో, వైవిధ్యమైన విషయాలతో మనలను అలరిస్తూ ఉంటాయి. ఈనాడు, జ్యోతి వగైరా పేపర్లు చదువుతాం. ఎన్ని చదివినా అవే వార్తలు, అవే కబుర్లు. విశ్లేషణలు మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటాయి. కానీ..

కంద పద్యం గురించి, కర్ణాటక సంగీత మాధుర్యం గురించి, రాయలసీమ వ్యావహారికంలో చిన్ననాటి కథలు, విశేషాలు, విదేశాల కబుర్లు, నిజమైన, నిష్పాక్షికమైన సినిమా సమీక్షలు, కడుపుబ్బ నవ్వించే గల్పికలు, నిర్మొహమాటంగా ఉండే రాజకీయ విశ్లేషణలు, వంటలు, సామాజిక సమస్యలు మొదలైన వాటిపై వ్యాసాలు.. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? సమకాలీనమైన ఈ విశేషాలు మనబోటి సామాన్యుడి మాటల్లో ఎక్కడ చూడగలం? బ్లాగుల్లో చూడగలం! అసలు మన పత్రికలపైనా, టీవీల పైనా, సినిమాల పైనా నిష్పాక్షికమైన విమర్శ కావాలంటే బ్లాగులు చూడాల్సిందే! మరోచోట దొరకవు. ఎవరైనా, ఏ విషయం గురించైనా రాయగలగడమే ఈ బ్లాగుల విశిష్టత! ఈ పేజీకి ఎడమ పక్కన ఉన్న బ్లాగుల లింకులకెళ్ళి చూస్తే, బ్లాగుల గురించి నేను చెప్పింది బహు తక్కువని తెలిసిపోతుంది. కూడలికి వెళ్తే బ్లాగుల పూర్తి జాబితా చూడవచ్చు.

వికీకి, బ్లాగులకు, ఆమాటకొస్తే తెలుగును ఇంటర్నెట్ వ్యాప్తం చెయ్యడానికి దోహదం చేసినవి కొన్నున్నాయి. తెలుగు నెజ్జనులకు అవి ప్రాతఃస్మరణీయాలు. ఓసారి బ్లాగుముఖంగా వాటిని స్మరించుకుంటాను.
  • తెలుగుబ్లాగు గూగుల్ గుంపు (http://groups.google.com/group/telugublog) నెట్లో తెలుగు అభివృద్ధికి దోహదపడిన అత్యుత్తమ స్థలం ఏదన్నా ఉందీ అంటే.. అది ఇదే
  • లేఖిని (http://lekhini.org) తెలుగులో రాయడానికి ఇంతకంటే సులభమైన సైటు ఇంకా రాలేదు.
  • పద్మ (http://geocities.com/vnagarjuna/padma.html) నేను తెలుగులో రాయడం సాధన చేసిందిక్కడే. లేఖిని వచ్చాక, వెనకబడింది.
  • కూడలి (http://koodali.org) మొత్తం బ్లాగుల కబుర్లన్నీ ఇక్కడ చూడొచ్చు.
మొదటిదాని కర్త చావా కిరణ్ కూ, లేఖిని కూడలి ల కర్త వీవెన్ కు, పద్మను సృష్టించిన నాగార్జునకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. వీటిని పెంచి పోషించిన తెలుగువారికందరికీ అభినందనలూ తెలపాలి.

తరువాతి కాలంలో వెలసిన కిందిసైట్లు కూడా ఇతోధికంగా సేవ చేస్తున్నాయి.
  • తెలుగుబ్లాగర్స్ (http://www.telugubloggers.com)
  • తేనెగూడు (http://www.thenegoodu.com)
  • జల్లెడ (http://jalleda.com)
ఈనాడులోను, ఇతర పత్రికల్లోను వచ్చిన వ్యాసాలు ప్రజలను పై సైటుల వైపుకు పంపిస్తే తెలుగువారు తెలుగులో చదివేందుకు, రాసేందుకు పై సైటులు ఎంతో దోహదం చేసాయి.

కొత్తవారి కోసం
నెట్లో తెలుగుకు మీరు కొత్తవారైతే, అసలెక్కడ మొదలుపెట్టాలబ్బా అని అయోమయంగా ఉంటే తెలుగుబ్లాగు గూగుల్ గుంపుకు వెళ్ళండి. అక్కడి సభ్యులు మీకు దారి చూపిస్తారు. నేను పైన రాసిన విశేషాలు చాలా తక్కువ -సింధువులో బిందువంత! ఓసారి గుంపులో చేరాక, ఇంకా బోలెడు సంగతులు తెలుస్తాయి. అంతర్జాలానికే ప్రత్యేకించిన పత్రికల దగ్గరనుండి, తెలుగు భాష అభివృద్ధి కోసం మనవాళ్ళు పాటుపడుతున్నారన్న విషయం దాకా ఎన్నో విషయాలను మీరు చూడాల్సి ఉంది. ఆయా పనుల్లో మీరూ పాల్గొనాల్సి ఉంది. రండి!

15, సెప్టెంబర్ 2007, శనివారం

మీ నిర్వాకం సంగతి చూడ్డానికి వేరే రాష్ట్రానికి పోవాలా ముఖ్యమంత్రీ?

14 కామెంట్‌లు
ఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో లాగా అభివృద్ధి జరగడం లేదట. ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ సంగతి తేల్చేందుకు ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళి చూద్దామని సవాలు కూడా చేసాడు. ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దామని చంద్రబాబును ఆహ్వానించాడు కూడా.

మన అభివృద్ధి సంగతి తెలుసుకుని మూర్ఛబోదామని నాకూ ఉంది. కానీ అంతకంటే ముందు చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు అలా దేశం తిరిగొస్తే ప్రయోజనమేమైనా కలుగుతుందా అని ఆలోచించ దలచాను. ఈమధ్య ఈ జనాలు ఓబులాపురం చూసొచ్చారు. సింగడు అద్దంకి వెళ్ళాడు, వచ్చాడు అన్నట్టు.. వీళ్ళూ వెళ్ళారు, వచ్చారు. తెదేపా 'ఏమీ బాలేదు' అని అంది.. ఏంబాలేదో, ఎందుకు బాలేదో
చెప్పలేకపోయింది, మామూలుగానే! మిగతావాళ్ళు 'ఏంలేదు, అంతా బానే ఉంది' అంటూ జేజేలు కొట్టొచ్చారు. ఆ మాత్రపు ముష్టి పని కోసం ఈ నాయకులంతా పాంట్లు ఎగలాక్కోని ఓబులాపురం దాకా పొయ్యొచ్చారు. అవునులే జీవితంలో మరో రకంగా 'గాలి'మిషను (హెలికాప్టరు) ఎక్కగలిగే వాళ్ళా!? 'గాలి' అబ్బాయి వీళ్ళని చూసి ముష్టి వెధవలని అనుకొని నవ్వుకొని ఉంటాడు. హై. లో కూచ్చుని గనులు లీజుకెలా ఇచ్చారో పరిశీలిస్తే ఇక్కడే తెలిసిపోయేది ఆ లీజు భాగోతం; కోర్టుకు తెలిసిపోలా!!?

వీళ్ళింత చేతకాని వాళ్ళని తెలిసే ముఖ్యమంత్రి వెళ్ళొద్దాం వస్తారా అని చిటికెలేస్తున్నాడు. అసలు మన గొప్ప తెలుసుకొనేందుకు ఎక్కడికన్నా పొయ్యి రావాలా, అనేది నా సందేహం.

ముఖ్యమంత్రీ.. అక్కడికెళ్ళి ఏంచేస్తారు?

  • ప్రజల పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా, ఇంత నిష్పూచీగా ఉండే ప్రభుత్వం మరోటుందేమో చూసొస్తారా?
  • కోర్టులు మీ ప్రభుత్వాన్ని తిట్టినట్టు ఇంకెవరినైనా తిట్టారో లేదో తెలుసుకుంటారా?
  • తరాల తరబడి ప్రభుత్వ భూములను కాజేసి, వాడేసుకొని ఇవ్వాళే తెలుసుకున్నట్టు, ప్రభుత్వానికి అప్పజెప్పినట్టూ నాటకాలాడే పత్తిత్తుల కోసం వెతుకుతారా?
  • రాష్ట్రం మొత్తాన్ని ప్లాట్లు చేసి లాట్లుగా అమ్మేసే ప్రభుత్వం ఇంకెక్కడైనా ఉందేమోనని చూసొస్తారా?
  • ఫైళ్ళు చూడకుండానే సంతకాలు పెట్టేసే ముఖ్యమంత్రులు, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టిచ్చేసే మంత్రులు ఇంకా ఎక్కడెక్కడున్నారో చూసొస్తారా?
  • నేరస్తులతో చెట్టాపట్టాలేసుకు తిరిగే పాలకుల కోసం వెతుకుతారా?
  • పర్సనల్ కార్యదర్శి నుండి ప్యూను దాకా అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన మరో పేషీ ఎక్కడన్నా ఉందేమోనని చూసొస్తారా?
  • బినామీ పేర్లతో కంపెనీలే పెట్టిపారేసే మంత్రులు ఇంకా ఎక్కడైనా ఉన్నారో లేదో చూసొస్తారా?
  • ఒకదాని తరవాత ఒకటి బాంబులేసినోడెవడో నీకు తెలీదు. గుజరాతులో నేరం జరిగితే, వాళ్ళు, మీ పోలీసుల్లోనే దొంగ వెధవలున్నారంటూ ఇక్కడికొచ్చి మరీ చెప్పి పోయారు. ఈ మాత్రం తెలుసుకొనేందుకు పైరాష్ట్రానికెందుకు పోయి రావడం డబ్బు దండగ కాకపోతే! వాళ్ళే ఇక్కడికొచ్చి చెబుతున్నారు గదా!
  • సబ్ కాంట్రాక్టులు పొందే కుట్రతో, కాంట్రాక్టులు పెద్ద కంపెనీలకు ఇప్పించి, వాటి నుండి పొందిన సబ్ కాట్రాక్టులతో నాసి రకం కట్టుబడులతో రాజకీయులు కోట్లు పోగేస్తున్న వైనం ఇంకా ఎక్కడుందో చూసొస్తారా?
  • కడుతూ ఉండగానే కూలిపోయే వంతెనలు, పైదారులు, కిందారులు దేశంలో ఎక్కడున్నాయో వెతుక్కుంటూ పోతారా?
  • 11 కోట్లు అప్పనంగా ఇచ్చి పారేసి, ఎవడికిచ్చామో కూడా తెలీని పరిస్థితి ఇంకా ఎక్కడైనా ఉందో లేదో చూసొస్తారా?
  • రాజీవు, ఇందిర, సోనియా అంటూ చెక్కభజన చేస్తూ సొంత రాష్ట్రపు నాయకులను విస్మరించే జాతి ఇంకా ఎక్కడైనా ఉందేమోనని చూసొస్తావా?
  • గత సీవీసీ రామచంద్ర సమాల్ ఏమంటున్నారో వినబడిందా? ఇన్నాళ్ళూ ఆయన చెప్పినవన్నీ పెడచెవినబెట్టావు. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు మాకూ వినబడుతున్నాయి. ఆయనిలా అంటున్నాడు..

    "ఆంధ్రప్రదేశ్ భూగర్భాన్ని సముద్రంలోపల, సముద్రం బయట ఇంత వ్యవస్థీకృతంగా దోపిడి చేయటం ఎప్పుడూ చూడలేదు."
    "..అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుత నాణ్యత నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రత్యామ్నాయం ఒక భ్రమ. అందరూ కాంట్రాక్టర్లుగా మారిపోయారు."
పై రెండు మాటలూ చాలవా మీ బాగోతాలు తెలిసేందుకు? మీ నిర్వాకాలు ఇట్టా ఏడుస్తున్నాయి. ఈ మాత్రపు బోడి సంగతి తెలుసుకునేందుకు దేశం మీద పడి తిరిగిరావాలా? ఏమక్కర్లేదు!! అవినీతి, అక్రమాలు ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాల వాళ్ళే ఇక్కడికి వస్తారేమో కనుక్కోండి.. ఆ రకంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

మీ బాగోతాలు బయట పెట్టేంతటి తెలివి ఈ చేతకాని ప్రతిపక్షానికి లేదు. ఉంటే, ఇన్నాళ్ళూ మీ ఆటలిలా సాగేవా?

సంబంధిత టపాలు